Saturday 18 January 2014

ధర్మమే గెలుస్తుంది

ధర్మమే చివరికి గెలుస్తుందని మన వేద పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. ధీరులైన వారు ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకంజ వేయరు.
జీవితంలో సుఖం కన్నా దుఃఖమే మనకు ఎక్కువ పాఠాలు నేర్పుతుంది. భగవంతుడు సర్వులకూ చెందిన వాడు. అయినా అందరూ ఆయనలో లేరు.
మనిషి సుఖంగా ఎలా జీవించాలో ధార్మిక సాహిత్యం చెబుతుంది.

వ్యసనాలకు లోనైతే భగవంతుడు అండగా ఉన్నా కష్టాలు పడవలసిందేనని తెలుపుతుంది పాండవుల కథ.
ధర్మరాజు అంతటివాడు కూడా జూదంవల్ల సర్వం కోల్పోయి, అడవులకు వెళ్ళవలసి వచ్చింది. ఇక మనమెంత? ఈ విషయం తెలుసుకొని వ్యసనాలను వదిలిపెట్టాలి.
వ్యసనాలతో సంపదలూ, సర్వం కోల్పోతున్నా వివేకజ్ఞానం లేక కష్టాలు పడతారు జనులు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. పాండవులు అడవుల పాలైనా, వారు ఎప్పుడూ నిరుత్సాహపడలేదు.
వారు ధర్మపరులు కనుక, చివరకు దైవ సహాయంతో అధర్మంపై గెలిచి, సుఖసంతోషాలను పొందారు. కష్టాలు అందరికీ వస్తాయి. వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నామన్నదే ముఖ్యం.
కష్టాలు కోతులలాంటివి. వాటికి భయపడితే మనం సర్వనాశనమవుతాం. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళడం నేర్చుకోవలసిందని స్వామి వివేకానంద చెప్తారు.
ఈ గుణపాఠాన్ని ఆయన స్వయంగా తెలుసుకున్నారు. ఆత్మ విశ్వాసంతో కష్టాలను ఎదుర్కొని, పాండవుల లాగా విజయం సాధించాలి.
వేద, పురాణ ఇతిహాసాల సారాంశాన్ని మన జీవితానికి అన్వయించుకొని, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలి. లేకపోతే నష్టపోయేది మనమే!
"సత్యమేవ జయతే" - ఎన్నటికైనా సత్యమే గెలుస్తుంది. అసత్యం, అబద్ధం, అధర్మం, గెలవవు. ఎల్లప్పుడూ సత్యాన్ని అంటి పెట్టుకోవాల్సిందని శ్రీరామకృష్ణుల ఉవాచ.
భగవద్ విశ్వాసంతో, శరణాగతితో మనం జీవితంలో విజయ సోపానాలను అధిరోహించాలి..... 

No comments:

Post a Comment