Monday 12 May 2014

నృసింహ జయంతి


నృసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ రోజు సాయంకాలం నరసింహ మూర్తి హిరణ్య కశిపుని వధించడానికి ఆతని ఆస్థాన మండప స్తంభము నుండి ఉద్భవించెను.

"వైశాఖశుక్లపక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్,మజ్జన్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్"


అని నరసింహుడు ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా నృసింహ పురాణము లో కలదు.శ్రీవైష్ణవులు సంప్రదాయానుసారంగఅ త్రయోదశి (ముందు రోజు) నాటి రాత్రి ఉపవాసం ఉండి, చతుర్దశి నాడు కూడా ఉపవాసం ఉండి, ప్రదోష కాలమున నృసింహ విగ్రహమును పూజించుతారు. స్తంభములో జన్మించాడు గనుక భవంతి స్తంభములకు తిరుమణి, తిరు చూర్ణములు పెట్టి పూజిస్తారు. రాత్రి జాగరణము చేసి, స్వర్ణసింహ విగ్రహమును దానమిచ్చి, మరునాడు పారణ చేయుదురు. వైశాఖము గ్రీష్మము గనుక వడపప్పు, పానకము ఆరగింపు పెడతారు.




Friday 9 May 2014

సత్యనారాయణ వ్రత విధానం

సత్యనారాయణ వ్రత విధానం: ఉదయాన్నే లేచి నిత్యకర్మలు పూర్తి చేసుకుని, స్వామి వారిని మనసులో తలచి "ఓ దేవ దేవా! శ్రీ సత్యనారాయణమూర్తీ! నీ అనుగ్రహము కోరి భక్తి శ్రద్ధలతో నీ వ్రతము చేయుచున్నాను " అని సంకల్పించుకోవలెను. మధ్యాహ్మ సమయంలో పనులన్ని పూర్తి చేసుకుని సాయంకాలం రాత్రి ప్రారంభమవుతుండే సమయంలో ఈ వ్రతమును చేయవలెను. ( నేడు అందరూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉండలేక ఉదయాన్నే చేసుకొను చున్నారు. సాయంత్రం శ్రేష్ఠమైనది. ఇక చేయలేని సమయంలో ఉదయాన్నే చేయటం రెండవ పక్షం. ఏదైనా చేసిన కాసేపూ పూర్తి మనసుతో చేయడం మంచిది. )

శుచి అయిన ప్రదేశంలో గోమయముతో అలికి, అయిదు రంగుల చూర్ణములతో ( పొడులతో ) ముగ్గులు పెట్టి, అచట ఆసనము ( వ్రతం పీట )వేసి, దానిపై కొత్త వస్త్రము( తెల్ల టవల్ ) పరిచి, దానిమీద బియ్యము పోసి, దాని మధ్యలో కలశము ( మట్టి,రాగి, వెండి లేదా బంగారం ) ఉంచి, దానిపై మరల కొత్త వస్త్రమును ( జాకెట్ పీస్ ) ఉంచవలెను. ఆ వస్త్రము మీద ప్రతిమా రూపుడైన సత్యనారాయణ స్వామిని ఉంచవలెను. ( శక్తిమేర ఓ ప్రతిమను బంగారంతో చేయించి, పంచామృతములతో అభిషేకించి, దానిని కలశముమీద ఉంచ వలెను. )

ఆ మండపములో బ్రహ్మాది పంచలోక పాలుకులను, నవగ్రహములను,అష్ట దిక్పాలకులను ఆవహన చేసి పూజించ వలెను. తరువాత కలశములో స్వామివారిని ఆవాహన చేసి పూజించ వలెను. పూజానంతరము కథ విని ప్రసాదమును బ్రాహ్మలతోను, బంధువులతోనూ గూడి స్వీకరించ వలెను.

ఈ వ్రతాన్ని వైశాఖ మాసములో గానీ, మాఘమాసమున గానీ, కార్తీక మాసమున గానీ శుభదినమున చేయవలెను. కలతలతో నున్నవారు చేయటం చాలా మంచిది. శుభకార్యాలలో చేయటం నేడు ఆచారంగా వస్తున్నది. ఈ వ్రతాన్ని నెలకు ఒక సారి కానీ , సంవత్సరానికి ఒక సారి కానీ చేయవచ్చును. ఎవరి శక్తిని బట్టి వారు చేయ వచ్చును. ( కొత్తగా పెళ్లైన దంపతులకు నేను నెలకు ఒక సారి చొప్పున చేయించాను. వారు చాలా అన్యోన్యంగా,సంతోషంగా గడపడం నెను గమనించాను. కనీసం సంవత్సరానికి ఒక్క సారైనా ఈ వ్రతం చేయమని నా సలహా )

పూజ చేసిన నాడు ఏకభుక్తము ( ఒక పూట మాత్రమే భుజించుట ) చేయ వలెను. బ్రహ్మ చర్యము పాఠించ వలెను. మనసును, బుద్ధిని, కర్మలను మంచి వాటిపై నిలుప వలెను. (ఆ ఒక్క రోజు అయినా)సత్యమునే పలకవలెను. ఎంత శ్రద్ధతో, నిష్ఠతో చేస్తే అంత సత్ఫలితాన్నిస్తుంది.

Thursday 8 May 2014



కాలజ్ఞాన రూపకర్త శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారి ఆరాధనా

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు వినగానే మనకు జ్ఞాపకమొచ్చేది కాలజ్ఞానం. భవిష్యత్తును పాట రూపంలో చెప్పిన ఈయనకు కాలజ్ఞానంపై సినిమాలు కూడా రూపొందిచారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 17వ శతాబ్దానికి చెందినవారు. పశువుల కాపరిగానే ఉంటూ తన మహత్తర కంఠస్వరంతో తత్వాన్ని జనానికి భోధించిన యోగి.

ఈయన సమాజంలోని కుల జాఢ్యాన్ని రూపుమాపడానికి కృషి చేశారు. ఈయనకు అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుడు సిద్దయ్య దూదేకుల కులానికి చెందిన వాడు. మరొక భక్తుడు కక్కయ్య ఇంకొక కులానికి చెందినవాడు ఇలా వివిధ కులాలకు చెందిన వారిని దరిన చేర్చుకుని తన తత్వాన్ని జనంలోకి ప్రచారం చేశారు. 





కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండంలోని ఆయన పేరిట పెద్ద మఠం ఉంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఆయన పేరిటే ఆ మండలం ఏర్పడింది. సంఘసంస్కర్త అయిన ఆయన తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయని చాలా మంది నమ్మకం.

కడప జిల్లా లోని కందిమల్లాయపల్లిలో బ్రహ్మంగారు సజీవ సమాధి అయ్యారు. వీరబ్రహ్మంగారి వలనే కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. కర్ణాటక, తమిళనాడులతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడకు వెళ్ళడానికి మైదుకూరను నుంచి బస్సుసౌకర్యం ఉంది. 

అందరూ కలిసిమెలిసి జీవించండి. ఆనందంగా ముందుకుసాగండి అన్నారు స్వామి. ఆయన ఆధాత్మిక జీవనవిధానం చక్కగా దోహదం చేస్తుంది. అది వ్యక్తిస్వర్ధాన్ని పక్కకుపెట్టి త్యాగాన్ని వృద్దిచేస్తుంది. తద్వారా పరహితం కోరగలరు. స్వహితం కొంత పక్కన పెట్టగలరు. సాధనతో ముందుకుసాగితే ఇంకా వివేకవంతులై నవ్య సమాజానికి బాటలు వేయగలరని ఉద్బోధించారు స్వామి. కనుక స్వామిచెప్పిన మార్గాన్ని అవలంబించి సమాజహితులమై శ్రేయో మార్గాన్ని అవలంబిస్తు; కావున అందరూ వైశాఖశుద్ధ దశమి బ్రహ్మంగారి ఆరాధన జరుపుకొనవలెను. వీలయినవారు బ్రహ్మంగారి మఠం (కందిమల్లయ్యపల్లి) దర్శించగలరు. అంతేగాక ఆర్థిక స్తోమత లేనివారు తమ తమ గృహములలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అష్టోత్తరపూజ చేసి నివేదన జేయగలరు. బ్రహ్మంగారి కళ్యాణము (కందిమల్లయ్యపల్లి) బ్రహ్మంగారి మఠము నండు మహాశివరాత్రిపర్వదినమున అత్యంత వైభవోపేతంగా జరుగును. కావున తప్పక దర్శించగలరు.