Sunday 27 April 2014

పెద్దబాలశిక్ష గ్రంథంలాంటిది

సాంప్రదాయమైన తెలుగు విద్యాభ్యాసంలో ‘పెద్దబాలశిక్ష’ ఆది గ్రంథంలాంటిది. మహాభారతంలాగానే పెద్దబాలశిక్షను కూడా పద్దెనిమిది పర్వాలుగా విభజించారు. అందుకే దీనిని ‘బాలల విజ్ఞానసర్వస్వం’గా భావిస్తారు. పూర్వం ఆంధ్రదేశంలోని ప్రతి విద్యార్థి పెద్దబాలశిక్షతోనే చదువు ప్రారంభించేవారు. ఐదవ తరగతి పూర్తయ్యేసరికి పెద్దబాలశిక్ష కంఠపాఠమవ్వాలి. ఆంగ్లేయుల కాలంలో ఆంధ్రదేశంలోని అన్ని పాఠశాలల్లోను పెద్దబాలశిక్ష పాఠ్యాంశంగా ఉండేది.

నేపథ్యం...
ఆంగ్లేయుల దగ్గర రెవెన్యూ శాఖలో పనిచేస్తూన్న స్థానికుల కోసం, 1832లో ‘మేస్తర్ క్లూలో’ అనే తెల్లదొర ‘పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి’ అనే పండితుడి చేత ‘బాలశిక్ష’గ్రంథాన్ని రచింపచేశాడు. పిల్లలకు తేలికగా అర్థమవ్వాలనే లక్ష్యంతో ఈ పుస్తక రూపకల్పన జరిగింది. ఇది 1856 నాటికి 78 పుటలతో పుస్తక రూపంగా వెలువడింది. ఇటువంటి పుస్తకం కోసం ఎదురుచూస్తున్న తెలుగువారు దీనిని మనసారా అక్కున చేర్చుకున్నారు.

1865లో వెలువడిన 90 పుటల బాలశిక్షలో, పాత ముద్రణలో లేని సాహిత్య విషయాలు, ఛందస్సు సంస్కృత శ్లోకాలు, భౌగోళిక విషయాలను చేర్చి, ‘‘బాలవివేక కల్పతరువు’’ గా రూపొందించారు. అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలో ఉన్న పుస్తకం పెద్దబాలశిక్షగా కొత్తపేరును సంతరించుకుంది. ఇందులో భాష, సంస్కృతులకు కావలసిన భాషా విషయాలు, అక్షరాలు, గుణింతాలు, ఒత్తులు, సరళమైన పదాలు, రెండుమూడు అక్షరాలతో కూడిన మాటలు, తేలిక వాక్యాలు, నీతి వాక్యాలు, ప్రాసవాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ అందరూ తెలుసుకోదగ్గవీ, అప్పటివరకు తెలిసి ఉన్న చారిత్రక భౌగోళిక విజ్ఞాన సంబంధ విషయాలు... వీటన్నిటినీ ఈ పుస్తకం లో పుదూరువారు పొందుపరిచారు.

పుదూరి వారి తర్వాత పేర్కొనదగిన పరిష్కరణ 1916 లో వచ్చిన వావిళ్ల వారిది. భాషోద్ధారకులు వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి 1949 పరిష్కరణలో... ‘‘భారతదేశమునకు స్వరాజ్యము లభించినందుకు ఇక ముందు దేశభాషలకు విశేషవ్యాప్తి ఏర్పడి, ఇట్టి (బాలశిక్ష) గ్రంథములకు వేలకువేలు ప్రచారమగునని తలంచుచున్నాను’’ అని చెప్పారు.

కొన్ని మార్పులు, చేర్పులతో ఎందరో ప్రచురణకర్తలు, ఎన్నో పండిత పరిష్కరణలతో నేటికీ వెలువడుతూనే ఉంది. పిల్లలకే కాకుండా పెద్దలకు సైతం తెలుగుదనాన్ని నేర్పి, చక్కని పండితపౌరులుగా తీర్చిదిద్దే సామర్థ్యం పెద్దబాలశిక్షకు ఉంది. 1983లో రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రాశస్త్యాన్ని గ్రహించి కొన్ని భాగాల్ని పాఠ్యాంశాలుగా కూడ చేర్చింది. పత్రికాధిపతులు, విజ్ఞులు పెద్దబాలశిక్షను ‘గుణశీల పేటిక’ గా అభివర్ణించారు. నాటి నుంచి నేటివరకు పెద్ద బాలశిక్షను తెలుగువారంతా తమ మానసపుత్రికగా కాపాడుకుంటూనే ఉన్నారు. ఇంటింటా ఈ పుస్తకం ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నారు. తెలుగు సంవత్సరాలు, నక్షత్రాలు, రాశులు, చుట్టరికాలు, తిథులు, మాసాలు, ఋతువులు, వారాలు, అధిపతులు, సప్తద్వీపాలు, దశావతారాలు...వంటి అంశాలు ఇందులో ఉంటాయి.

ప్రస్తుతం తెలుగునాట పన్నెండు రకాలకు పైనే పెద్దబాలశిక్షలు లభిస్తున్నాయి. బుడ్డిగ సుబ్బరాయన్ రూపొదించిన ‘సురభి’ గాజుల సత్యనారాయణ ‘తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష’ విరివిగా లభిస్తున్నాయి. ఈనాటికీ ‘పెద్దబాలశిక్ష’ పేరుకు ఎంతో గౌరవం, ఆదరణ ఉన్నాయి. ‘పెద్దబాలశిక్ష’ వంటి పుస్తకం తెలుగువారి సొంతం. ఇది తెలుగుభాష గొప్పదనం, తెలుగుజాతి నిండుదనం, తెలుగువారి అదృష్టంగా భావించాలి. ప్రస్తుత ఈ పుస్తకం మూడు సంవత్సరాలలోపే 36 సార్లు ముద్రణ పొంది, రెండున్నర లక్షల ప్రతులు చెల్లాయి. పెద్దబాలశిక్ష పేరు చిరస్థాయిగా నిలిచితీరుతుంది.

Saturday 26 April 2014

భాగవతంలోని గజేంద్రమోక్షం లోని భాగం --- కరిఁ దిగుచు మకరి సరసికి

కరిఁ దిగుచు మకరి సరసికి
గారి దరికిని మకరిఁ దిగుచుఁ గరకరి బెరయన్
గారికి మకరి మకరికిఁ గరి
భరి మనుచును నతలకుతల భటు లరుదు పడన్ .




పోతన గారు రచించిన భాగవతంలోని గజేంద్రమోక్షం లోని భాగం లో రచించిన పద్యం ఇది. ఏనుగు నీరు త్రాగడానికి నదిలో దిగినప్పుడు ముసలి ఎనుగుపాదం తన నోటితో గట్టిగా పట్టుకుంది.

భావం :- ఒకరిపై ఒకరికి పగ పెరిగే విధముగా ముసలి, ఏనుగు ఆ నదిలో పోరాడుచున్నవి. ముసలి, ఏనుగును నదిలో లాగుచున్నది. ఏనుగు ముసలిని నెల పైకి ఈడ్చుచున్నది. ఒకదానికి ఒకటి భయపడకుండా పోరాడుచిన్నవి. 

రామాయణలో కథ కైక పాత్రకున్న ప్రాధాన్యం

రామాయణ కథని మలుపు తిప్పిన స్త్రీ పాత్రలలో కైకది ఒక కీలకమైన పాత్ర అని అందరికీ తెలిసిన విషయమే. దశరథుని ఆకాంక్ష మేరకు రాముని పట్టాభిషేకం జరిగిపోయుంటే, రామాయణం అక్కడితో ఆగిపోయేది.


అది కాకుండా మలుపు తిప్పినది కైక. అయితే, వాల్మీకి రామాయణంలో కైక పాత్ర కీలకమైనదే కాని, చాలా పరిమితమైనది. కేవలం రామపట్టాభిషేక సందర్భంలో, అలుక పూని, వరాలడిగి, పట్టాభిషేకం చెడగొట్టి, రాముడిని అడవులకి పంపించడం వరకే ఆమె పాత్ర మనకి ప్రముఖంగా కనిపిస్తుంది వాల్మీకంలో. ఆ తర్వాత కథని ముందుకి నడిపించేది సీత. రాముని సర్వ ప్రయత్నమూ సీత కోసమే. ముందుగా లంకలోకి ప్రవేశించి, లంకని సర్వనాశనం చేసి, చివరకి రావణునితో పాటు సర్వ రాక్షస సంహారానికీ కారణమైనది సీతే. అందుకే వాల్మీకి మహర్షి రామాయణాన్ని గురించి “సీతాయాశ్చరితం మహత్” అన్నది. అంతటి సీత పాత్రకి సరిజోడుగా, అంతటి ప్రాధాన్యమున్న పాత్రగా కల్పవృక్షంలో కైకని తీర్చిదిద్దారు విశ్వనాథ.  రావణసంహారం చేసి వనవాసం ముగించుకొని సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చిన్నప్పుడు కైకేయి సీతని కౌగిట చేర్చుకొని యిలా అంటుంది

కైకెయి సీత గౌగిటికి గైకొని, “ఓసి యనుంగ! నీవుగా
గైకొని యీ వనీచయ నికామ నివాసభరంబిదెల్లనున్
లోకము నన్ను తిట్టుట తలోదరి! మార్చితి, కైక పంపెనే
గాక దశాననాది వధ కల్గునె యన్న ప్రశంస లోనికిన్”


“కైక రాముడిని అడవులకి పంపేసింది” అనే నిందని, “ఆహా! కైక పంపినందువల్లనే కదా రావణాది రాక్షసుల సంహారం చేసి రాముడు దిగంత కీర్తి సంపాదించాడు” అనే ప్రశంసగా మార్చేసిందట సీత. అంతే కదా! రామాయణానికి మరో పేరు “పౌలస్త్య వధ”. అంటే, రామాయణ కథకి అంతిమ గమ్యం రావణ వధ. దానికి కైక వరాలే కదా కీలకం! విశ్వనాథవారీ కీలకాన్ని గ్రహించి, కైక పాత్రని దానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. మొదట తల్లిని తీవ్రంగా దూషించిన కన్నకొడుకు భరతుడే కల్పవృక్షం చివరలో, “కైకేయీ సముపజ్ఞ మియ్యది జగత్కల్యాణ గాథా ప్రవాహాకారంబయి పొల్చు రామకథ” అని అనుకుంటాడు. అదీ రామాయణ కల్పవృక్షంలో కైక పాత్రకున్న ప్రాధాన్యం.

Friday 25 April 2014

తెలుగు నెలలు (తెలుగు మాసములు)

తెలుగు నెలలు (తెలుగు మాసములు)
తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.
ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:
శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).
కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).


తెలుగు నెలలు :
చైత్రము
వైశాఖము
జ్యేష్ఠము
ఆషాఢము
శ్రావణము
భాద్రపదము
ఆశ్వయుజము
కార్తీకము
మార్గశిరము
పుష్యము
మాఘము
ఫాల్గుణము
ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.
పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము .
పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వైశాఖము.
పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల జ్యేష్ఠము .
పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆషాఢము.
పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల శ్రావణము .
పౌర్ణమి రోజున పూర్వాభాద్ర్హ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాభాద్రా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల భాద్రపదము.
పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆశ్వయుజము.
పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల కార్తీకము.
పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రుడు మృగశిరా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మార్గశిరము .
పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల పుష్యము.
పౌర్ణమి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రుడు మఖా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మాఘము.
పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం (అనగా చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఫాల్గుణము.

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

ఋణ విమోచన నృసింహ స్తోత్రం



దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౧ ||
లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౨ ||
ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౩ ||
స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౪ ||

Wednesday 23 April 2014

సాలగ్రామాలు

సాలగ్రామము విష్ణుప్రతీకమైన , విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషము. కలికాలంలో భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీభాగవతం చెబుతుంది. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు. భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు. దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.

 సాలగ్రామాలు గండకీ నదిలో లభిస్తాయి
పంచాయతనం
పంచాయతనం లో ఉండే ఐదు మూర్తులు:
ఆదిత్యం - స్ఫటికం
అంబికాం - లోహం
విష్ణుం - సాలగ్రామం
గణనాథం - ఎర్రరాయి
మహేశ్వరం - బాణం
ఈ ఐదింటికీ పూజ చేయడాన్ని పంచాయతన పూజ అంటారు. వీటిలో ఏది మధ్యలో ఉంటే ఆ పంచాయతనం అంటారు. సాలగ్రామాన్ని మధ్యలో ఉంచితే 'ఆదివిష్ణు పంచాయతనం' అంటారు.



సతీ తులసి కథ
పూర్వం జలంధరుడనే రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడు. మునులు, దేవతలు తమను రక్షించమని విష్ణువుతో మొరపెట్టుకున్నారు. జలంధరుడి భార్య వృందాదేవి చేసే పూజల ఫలం రక్షణ మూలంగా జలంధరున్ని చంపడం శివుడివల్ల కూడా కాలేదు. దాంతో విష్ణుమూర్తి మాయా జలంధరుడి వేషంలో వెళ్ళి వృందాదేవి పాతివ్రత్యాన్ని భంగపరిచాడు. వెంటనే శివుడు జలంధరున్ని సంహరించాడు. అసలు విషయం తెలుసుకున్న వృందాదేవి కఠినశిలవైపొమ్మంటూ విష్ణువును శపించింది. విష్ణుమూర్తి ఆమె పాతివ్రత్యాన్ని మెచ్చి అనుగ్రహించగా తులసి మొక్కగా మారింది. విష్ణువు సాలగ్రామ రూపు ధరించాడు.
గండకీనదిలో లభించే సాలగ్రామాలు అనేక రకాలుగా ఉంటాయి. అవి లక్ష్మీనారాయణుడు, లక్ష్మీజనార్ధనము, రఘునాధము, వామనము, శ్రీధరము, దామోదరము, రఘురామము, రారాజేశ్వరము, అనంతము, మధుసూదనము, హయగ్రీవము, నారసింహము, లక్ష్మీనృసింహము. ప్రతిరోజూ సాలగ్రామము, తులసి, శంఖాలను పూజించేవారికి వైకుంఠం ప్రాప్తిస్తుందని పురాణకథనం.
మరికొన్ని విశేషాలు


సాలగ్రామాల రంగు, వాటిమీద ఉండే ముద్రలను బట్టి ఎన్నో రకాలు ఉన్నాయి. అలాంటి 12 రకాల సాలగ్రామాలు ఉండి పూజింపబడే ఇల్లు 108 వైష్ణవ దివ్యక్షేత్రాలతో సమానం అని అంటారు.
సాలగ్రామాలను కొంచెం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వాటికి నిత్యం అభిషేకం, నైవేద్యం చేయాలి. అలా చేయలేనివారు వాటిని వేరెవరికైనా దానమివ్వడం మంచిది. ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కొందరు వాటిని పూర్తిగా నీళ్ళల్లో మునిగేలా ఉంచుతారు. దానిని జలవాసం అంటారు. ఏదైనా ఆలయంలో దానిని ఉంచవచ్చును.
సాలగ్రామాలను కొనరాదు. ఇవి వంశపారంపర్యంగా రావాల్సిందే. అందుకే సాలగ్రామ దానం మహాదానం అని పెద్దలు అన్నారు.