Friday 9 May 2014

సత్యనారాయణ వ్రత విధానం

సత్యనారాయణ వ్రత విధానం: ఉదయాన్నే లేచి నిత్యకర్మలు పూర్తి చేసుకుని, స్వామి వారిని మనసులో తలచి "ఓ దేవ దేవా! శ్రీ సత్యనారాయణమూర్తీ! నీ అనుగ్రహము కోరి భక్తి శ్రద్ధలతో నీ వ్రతము చేయుచున్నాను " అని సంకల్పించుకోవలెను. మధ్యాహ్మ సమయంలో పనులన్ని పూర్తి చేసుకుని సాయంకాలం రాత్రి ప్రారంభమవుతుండే సమయంలో ఈ వ్రతమును చేయవలెను. ( నేడు అందరూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉండలేక ఉదయాన్నే చేసుకొను చున్నారు. సాయంత్రం శ్రేష్ఠమైనది. ఇక చేయలేని సమయంలో ఉదయాన్నే చేయటం రెండవ పక్షం. ఏదైనా చేసిన కాసేపూ పూర్తి మనసుతో చేయడం మంచిది. )

శుచి అయిన ప్రదేశంలో గోమయముతో అలికి, అయిదు రంగుల చూర్ణములతో ( పొడులతో ) ముగ్గులు పెట్టి, అచట ఆసనము ( వ్రతం పీట )వేసి, దానిపై కొత్త వస్త్రము( తెల్ల టవల్ ) పరిచి, దానిమీద బియ్యము పోసి, దాని మధ్యలో కలశము ( మట్టి,రాగి, వెండి లేదా బంగారం ) ఉంచి, దానిపై మరల కొత్త వస్త్రమును ( జాకెట్ పీస్ ) ఉంచవలెను. ఆ వస్త్రము మీద ప్రతిమా రూపుడైన సత్యనారాయణ స్వామిని ఉంచవలెను. ( శక్తిమేర ఓ ప్రతిమను బంగారంతో చేయించి, పంచామృతములతో అభిషేకించి, దానిని కలశముమీద ఉంచ వలెను. )

ఆ మండపములో బ్రహ్మాది పంచలోక పాలుకులను, నవగ్రహములను,అష్ట దిక్పాలకులను ఆవహన చేసి పూజించ వలెను. తరువాత కలశములో స్వామివారిని ఆవాహన చేసి పూజించ వలెను. పూజానంతరము కథ విని ప్రసాదమును బ్రాహ్మలతోను, బంధువులతోనూ గూడి స్వీకరించ వలెను.

ఈ వ్రతాన్ని వైశాఖ మాసములో గానీ, మాఘమాసమున గానీ, కార్తీక మాసమున గానీ శుభదినమున చేయవలెను. కలతలతో నున్నవారు చేయటం చాలా మంచిది. శుభకార్యాలలో చేయటం నేడు ఆచారంగా వస్తున్నది. ఈ వ్రతాన్ని నెలకు ఒక సారి కానీ , సంవత్సరానికి ఒక సారి కానీ చేయవచ్చును. ఎవరి శక్తిని బట్టి వారు చేయ వచ్చును. ( కొత్తగా పెళ్లైన దంపతులకు నేను నెలకు ఒక సారి చొప్పున చేయించాను. వారు చాలా అన్యోన్యంగా,సంతోషంగా గడపడం నెను గమనించాను. కనీసం సంవత్సరానికి ఒక్క సారైనా ఈ వ్రతం చేయమని నా సలహా )

పూజ చేసిన నాడు ఏకభుక్తము ( ఒక పూట మాత్రమే భుజించుట ) చేయ వలెను. బ్రహ్మ చర్యము పాఠించ వలెను. మనసును, బుద్ధిని, కర్మలను మంచి వాటిపై నిలుప వలెను. (ఆ ఒక్క రోజు అయినా)సత్యమునే పలకవలెను. ఎంత శ్రద్ధతో, నిష్ఠతో చేస్తే అంత సత్ఫలితాన్నిస్తుంది.

1 comment: